Sunday, July 13, 2014

ఆదివారం కబుర్లు :)

అలారం మోగగానే ఉలిక్కి పడి లేచిన నాకు, తల నొప్పి మొదలైంది. వారాంతం అనే సౌలభ్యమే లేకుండా, జీవితం రోజూ ఒకేలా ఉరుకులు తీస్తుండడం తో ఇవ్వాల  విరక్తి  తారస్తాయికి చేరింది. సరేలెమ్మని కాసిన్ని కాఫీ నీళ్ళు తాగుదామని వంట గదిలోకి వెళ్ళాను. పాలు లేవు సరి కదా, కాఫీ పౌడర్ కూడా లేదు. ఇవ్వాళ మన శకునం బాలేదు అనుకొని, మొహం కడుక్కొని అలా రోడ్ మీద నడుస్తున్న నాకు, పేపర్ వాడు తెలుగు పత్రికలు అమ్ముతూ కనబడ్డాడు . అంతే !! 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాను.

అది ఒకానొక ఆదివారం. "ఈనాడు" ఆదివారం పుస్తకం కోసం కొట్టుకొనే ప్రయాసలొ నేను, నా చెల్లి మునిగిపోయాం. అమ్మ కు ఆ రోజు వంట సెలవు ప్రకటించుకున్నాం. కాబట్టి, నాన్నకి ఫోన్ చేసి మాకు కావలసిన, దోసలు, పూరీలు పట్టుకురమ్మన్నాం. నాన్నలు ఉరికే బహుమతులు ఇస్తారా? ఇచ్చేముందు, దానికి సరిపడా కాసిన్ని నీతి వాక్యాలు వివరిస్తారు. ఆ రోజు విషయం "ఆరోగ్యం- వ్యాయామం". ఆదివారం 8:౩౦ కన్నా ముందు లేవని మాకు ఆది కొంచెం బాధాకరమైన ప్రసంగమే. కానీ తప్పదుగా ! చక్కగా బుద్ధిమంతులుగా వినేసి, దోసల మీద పెట్టాం మా దృష్టిని.

ఇక సెలవలు కాబట్టి పుస్తకాల ప్రస్తావనే లేదు. ఆదివారం అంటేనే వారానికి మొత్తం సరిపడా జ్ఞాపకాలు పోగు చేయలి. అందుకే ఇక రంగంలోకి దిగాం నేను  నా చెల్లి. బొమ్మలు, చిలిపి ఆటలు ఆడే వయస్సు దాటేసిందని మా బామ్మ చెప్తునే ఉంది, వింటామా ఏంటి ? వంట సామాన్లు తీశాం. ఆ వంట ఏదో నిజంగానే నేర్చుకోవచ్చుగా అని అందరు సలహాలు ఇచ్చేవాళ్ళే. అలా చేస్తే అది ఆట ఎలా అవుతుంది, Explosion అవుతుంది గాని... కావలసిన సామాన్లు అన్ని తెచ్చుకున్న మా చెల్లి ని చూసి మా నాన్న గట్టిగానే నవ్వేశారు. మరి మా వంటకాలు అలాంటివి. బూస్ట్ బాల్స్. పంచదార పకోడీ. ఉడకలేని పప్పు. మంచి నీళ్ళ చారు. ఓ, మార్చేపోయాను, కొరక లేని జిలెబీలు.

అందరికి బలవంతం గా తినిపించడం తో మాకు మేమే ప్రపంచం లోనే అతి గొప్ప chef లు గా సంబరపడిపోయాం. ఒక శకం ముగిసింది. ఇక, వారాంతం అంటే సినిమా ఉండాల్సిందే. అది ఎంత పనికిరానిదైనా సరే, వెళ్లాల్సిందే.. 1st show కి టికెట్స్ కావాలి ఆదివారం అంటే మేం మాత్రమే కాదుగా, అందరూ వెళ్తారు. కాబట్టి, నేను బయలుదేరాను, మా నాన్నతో,  బ్లూ స్కూటర్ ఎక్కి.

హాల్ బయట జనం చూసి బెంబేలెత్తిపోయాను నేను, హిట్ సినిమా అంట. ఇక అయిపోయింది పదమన్నారు నాన్న. వింటామా? నన్ను లోపలికి తీస్కెళ్ళమని గోల. సరే ఆ Gateవాడు మంచోడు, మమ్మల్ని పంపించాడు లోపలికి. క్యూ బయట హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేశారు. నాన్న ఎవర్నో కనుక్కుంటున్నారు దొరుకుతాయేమో అని. ఇంతలో మనం ఆ కౌంటర్ పక్కన సందులోకి దూరిపొయి, " అంకల్, ప్లీస్ ఒక్క 4 టికెట్స్ ఇప్పించండి" అంటూ  మొదలుపెట్టాను. "అలా ఇవ్వరు అమ్మా" అనేసాడు, ఏడుపే తక్కువ. అలానే నించున్నాను. దీనం గా చూస్తున్న నన్ను ఒక 5 నిమిషాలు ఆగి రమ్మన్నాడు. కౌంటర్ మూసేసి, "ఇదిగో, నేను ఇచిన్నట్టు ఎవ్వరికీ చెప్పద్దు, సరేనా " అని చేతిలో టిక్కెట్లు పెట్టాడు. డబ్బులు తీస్కొని, ఒక చిన్న చాక్లేట్ ఇచ్చి " నిన్ను మా అమ్మాయి తోటే చూశానులే, స్కూల్ డ్రామాలో, బాగా చేశావ్ బామ్మ లాగా. అందుకే ఇవి . బాగా చదువుకొని  గొప్ప ఉద్యోగం చేయాలి ". అన్నాడు. అంతే.... పరిగేతుకుంటూ వెళ్ళా మా నాన్న దగ్గరికి.

ఇది మరి సామాన్యమైన గెలుపు కాదు ! అరుస్తూ ఇంట్లోకి వెళ్ళిన నాకు మా చెల్లి విజయ రథం పట్టింది. నువ్వు world  లోనే best sister అక్కా అని సత్కరించింది :) ఇంతలో సినిమా టైమ్ అవ్వనే అయింది. అమ్మని త్వరగా రెడీ అవ్వమని చెప్తే నాన్న లేట్ గా వచ్చారు బయటకి. 7 మినిట్స్అయ్యింది మొదలయ్యి, ఇంకేమన్నా ఉందా.. టైటల్స్ మిస్ అయ్‌పోతాం. దూసుకుంటూ వెళ్ళా లోపలికి. హీరొ ఇంట్రొడక్షన్ సాంగ్. చెప్పానా? ఇంత హడావిడి లోను పాప్‌కార్న్ మర్చిపోలేదు నేను. సినిమా బానే ఉంది, ఫైట్స్, సాంగ్స్, ఏవో ఉన్నాయి. సమ్మర్ కదా, a/c hall భలే నచ్చేసింది.

ఇంటర్వల్ లో మళ్లీ బయటకి వెళ్ళి, కావాల్సినవన్నీ కొనిపించి, లోపలకి వచ్చాం. ఇంత ఆవేశం గా తీస్కెల్లిన్నదుకు, నేను సమోసాలు తిని నిద్రపోయాను హాల్ లో. క్లైమ్యాక్స్ లో ఏదో పెద్ద dialogue కి లేచాను, అప్పటికే మా అమ్మ నన్ను చూసి ముసిముసి గా నవ్వుతోంది. సరెలే, పరువు పోయింది గా అనుకోని, బయటకి వచ్చాం.

ఆ హాల్ లోంచి బయటకి వస్తుంటే భలే అనిపించేది, చుట్టూ అందరు ఒకే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అదీనూ మూవీస్టార్స్ గురించి. వాళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు గాని, అదో గమ్మత్తు అనుభూతి. ఇంటికొచ్చి అమ్మ కి చపాతీ లో సాయం, నాన్న కి తాళం వెయ్యడం లో సాయం  చేశాం. అలా చేస్తే గుడ్ ఇంప్రెషన్, తెల్సా ? తినేసి చూసోచిన సినిమా గురించి ప్రోగ్ర్యామ్స్ మళ్లీ టీవీ లో మోగించేవాళ్ళం. అలా వాటికి అంత వెర్రితనం అనవసరం అని వివరంగా అమ్మ నాన్న చెప్పడంతో మా భోజనం అయ్యింది.

గుడ్ నైట్ చెప్పేసి, ఇద్దరికీ బుగ్గమీద ముద్దు పెట్టేసి రయ్ మని రూమ్ లోకి పరిగెత్తాం. బారిస్టర్ పర్వతీసం బాగుంటుంది రాత్రి పూట చదుకోవడానికి, నవ్వుకుంటూ నిద్ర లోకి జారిపోయాం ఇద్దరం.

ఫోన్ రింగ్ అవ్వడం తో ఈ లోకానికి వచ్చాను, ఇంకెవరు, అమ్మ.

" టిఫిన్ చేశావా" అని. " ఉప్మా-పెసరట్టు తెప్పించుకున్నాను, ఇల్లు గుర్తుకు వచ్చింది " అని ముగించా.

బాల్యం ఎంత మధురం. చిన్న చిన్న ఆనందాలతో ఒక పెద్ద జీవితాన్నే  అల్లుకునే దశ.
అమ్మ కౌగిలి, నాన్న ఓదార్పు, చెల్లి సహచర్యం.
ఎన్ని నేర్చుకుంటే అంత ఉపయోగం. జగమంత కుటుంబం అనే నాంది కి మన సొంత కుటుంబమే గా స్పూర్తి ! 



7 comments:

  1. Balyam.. Telugu paatalu.. Maruvaleni tiyyati gnaapakalu. Gurtuchesinanduku neku vandanaalu ;),

    ReplyDelete
  2. You can start writing articles at Eenadu or Sakshi Sunday books :)

    ReplyDelete
  3. awesome... చాలా బాగా రాసారు... ఆడపిల్లల సంతోక్షాలికి అబ్బాయిల సంతోక్షాలికి చాలా తేడా ఉంది. ఆ విష్యం ఈ వ్యాసంలో చాలా బాగా తెలుస్తుంది.. ఫ్రెష్ ఆలోచనలను సింపుల్ గా బాగా ప్రెసెంట్ చేసారు.. ఒక ఫీల్ గుడ్ ఆర్టికల్.... :)

    ReplyDelete

Thanks for stopping by. Let your voice be pitched here !!